నా సంతకం తెలుగు లో మరి మీది?
దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణ దేవరాయలు అన్నట్టు మన తెలుగు భాష నిజంగా నే వినసొంపైన భాష. ఈ ఆధునిక యుగం లో మన తేనె లొలుకు తెలుగు భాషకి ప్రాచుర్యం తగ్గిపోతుంటే, చూస్తూ ఉండటం తప్ప నేను ఏమి చేయగలను? ప్రతి రోజు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల మన ఈ తరం పిల్లలు స్వచ్చమైన తెలుగు మాట్లాడటం, చదవటం మరియు వ్రాయటం పూర్తిగా మర్చిపోతారో ఏమో? ఈ కాలం చదువులు అలా ఉన్నయి మరి. ప్రతి ఒక్కరు ఆంగ్ల మాధ్యమం లో చదువుతూ మాతృ భాష ని ద్వితీయా భాష గానో లేదా తృతీయ భాష గానో చూస్తున్నారు. నా అదృష్టం కొద్దీ నేను నా ఉన్నత పాఠశాల తెలుగు మాధ్యమం లో చదువుకున్నాను. ఈ కారణంగా నాకు తెలుగు మాట్లాడటం, చదవటం మరియు వ్రాయటం బాగానే వచ్చు. నేను ఇప్పుడు అమెరికా లో ఉంటున్నా తెలుగు ఫై అభిమానం మాత్రం తగ్గలేదు. చాలా రోజులు నుంచి ఈ వ్యాసం వ్రాయలనుకుంటున్నా ఇప్పటికి కుదరియింది.
ఇప్పుడు ఉన్న సమయం లో రోజు-వారి కార్యకలాపాలకు పూర్తి తెలుగు వాడటం చాల కష్టం. కనీసం మన ఆదీనం లో ఉన్న వాటికైనా తెలుగు వాడదాం. ఉదాహరణకు మన సంతకం, మన మాతృ భాషలో చేద్దాం. నేను ఇప్పటి కీ నా సంతకం తెలుగు లోనే చేస్తాను. దాని వెనక ఒక చిన్న కథ ఉంది. నేను పదవ తరగతి చదువుతునప్పుడు నా సంతకం ఆగ్లం లొనే ఉండేది. ఉన్నత పాఠశాల తెలుగు మాధ్యమం కావటం వల్ల అంతా తెలుగు లోనేకావటం వల్ల తెలుగు పైన అప్పటికి ప్రత్యేక అభిమానం ఏమి లేదు. పదవ తరగతి తరవాత ఇంటర్మీడియట్ నేను నలంద కళాశాల లో ఆంగ్ల మాధ్యమం లో చదివాను. అక్కడ చాలా మంది నా తోటి విద్యార్థులకు తెలుగు చదవటం రాయటం రాదు అని తెలుసుకుని నివ్వెర పోయాను. దానికి తోడు రాదు అన్ని గర్వంగా చెప్పుకోవటం. తెలుగు మాధ్యమం లో చదివిన వాళ్ళని తెలియకున్నా చులకనగా చూడటం. అప్పుడు నాకున్న తెలుగు భాష పై అభిమానం ఇంకా పెరిగింది. అప్పుడు అనిపించింది అందరికి చెప్పాలి అని నేను తెలుగు వాడిని నాకు తెలుగు అంటే ఇష్టం మరియు తెలుగు వాడ్ని అయినందుకు గర్వపడుతున్నాను అని. అప్పుడు నాకు తట్టిన ఒక ఆలోచనే తెలుగు లో సంతకం చేయటం. అప్పటినుంచి నేను ఎప్పుడు తెలుగు లోనే సంతకం చేస్తాను.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తెలుగు రాష్ట్రం లోనే నేను తెలుగు లో సంతకం చేయటం పై వాళ్ల సందేహత వ్యక్తం చేశారు. అంత ఎందుకు మా నాన్న కూడా నా తెలుగు సంతకం పై వ్యతిరేకత తెలిపారు. కానీ నా నిర్ణయానికి అడ్డు చెప్పలేదు. ఇలా చాలా మంది నా సంతకం గురించి మాట్లాడారు. ఇంకొక సంఘటన మీతో పంచుకుంటా. నేను నా పాసుపోర్టు కు ధరఖాస్తు చేస్తున్నపుడు కూడా నా సంతకం తెలుగు లో నీ చేశాను. కానీ అక్కడ ఉన్న అధికారి నా సంతకం చూసి తెలుగు లో సంతకం చెల్లదు అన్నాడు. నాకు అప్పుడు అనిపించింది నేను ఆంధ్ర ర్రాష్ట్రం లోనే ఉన్నానా అని. పైగా ఆ అధికారి చెప్పిన కారణం “నువ్వు విమానాశ్రయం లో ఉన్నపుడు నీ తెలుగు సంతకం చూసి అక్కడి అధికారులు నువ్వు నిరక్షరాస్యుడవు అని వెనక్కి పంపేస్తారు” ఇది జ్ఞాపకం వస్తే ఇప్పటికి నాకు నవ్వు వస్తుంది. ఆ అధికారిని ఆలా ఎక్కడైనా రాసి ఉందా, ఉంటె వైస్ రాజశేఖరరెడ్డి (అప్పటి ముఖ్యమంత్రి) తెలుగు లోనే సంతకం చేస్తారు వారిని వెనక్కి పంపేరా అని అడిగా. దానీతో పాటు నందమూరి తారక రామారావు గారు కూడా తెలుగు లోనే సంతకం పెడతారు నేను పెడితే తప్పు ఏంటి అని అడిగా. దానితో పాటు తెలుగు లో సంతకం చేసే కొందరి ప్రముఖుల పేర్లు చెప్పాను. ఆ అధికారి కి నుంచి సమాధాం లేదు. ఇంకా చేసేది ఏమి లేక నా ధరఖాస్తును అంగీకరించాడు ఆ అధికారి. ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా చెప్పుకో దగ్గ విషయాలు ఉన్నాయి. నేను నా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం లో ఒక పరీక్ష రాస్తుంటే అదనపు జవాబు పత్రం కోసం సంతకం చేయాల్సి వచ్చింది. నా తెలుగు లో సంతకం చూసి ఆ సమయం లో ఉన్న ఆచార్యురాలు “నువ్వు పరీక్షా కూడా తెలుగు లో రాస్తావా” అని అడిగారు. నాకు ఏమి చెప్పాలో అర్థం కాక నాలో నేనే నవ్వుకుని పరీక్ష రాయటం మళ్ళీ మొదలు పెట్టా.
ఇది ఇలా ఉంటె నా తెలుగు సంతకం చూసి చాలామంది ఆశ్చర్యం తో పాటు అబినందనలు వ్యక్త్యపరిచారు. మొదట గా నేను చెన్నై లో వెబ్ 2 ల్యాబ్ లో ఉద్యోగం చేస్తునప్పుడు నా సంతకం చూసి నా తమిళ మిత్రులు అందరు నన్ను చాలా ప్రశంసించారు. ఇంకో సంఘటన నేను అమెరికా లో ఉన్నప్పుడు జరిగినది. నేను కూరగాయలు కోసం ఒక భారత కిరాణా కొట్టు కి వెళ్తే అక్కడ పనిచేసి బొక్కిసగాడు రసీదు పై తెలుగు సంతకం గమనించి బారెడంత ఉత్సాహం తో తెలుగు లో సంతకం చేసే మొదటి వక్తిని చూస్తున్నా చాలా సంతోషం అని అన్నాడు. ఇవే కాక నా సంతకం ఏ విదేశీయులు చూసిన నీ సంతంకం చాలా విభిన్నం గా ఉంది అంటారు. తెలుగు లో సంతకం పెట్టటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.
- తెలుగు వాళ్ళం అని గర్వంగా చెప్పుకోవచ్చు.
- మీ సంతకాన్ని అనుకరించటం చాలా కష్టం.
- మీ సంతకం అందరికన్న విభిన్నం గా ఉంటుంది.
- తెలుగు వారు మీ సంతకం చూసి సులువుగా గుర్తుపడతారు.
- మీ సంతకం సుందరంగా ఉంటుంది.
మరి మనం మన యువతరానికి తెలుగు లో సంతకం చేయటానికి ప్రోత్సహిదామా? ఇది నా మొదటి తెలుగు వ్యాసం, ఎక్కడైనా తప్పుడు దొర్లి ఉంటే క్షమించండి. ముందు ముందు మరిన్ని తెలుగు వ్యాసాలు వ్రాయటానికి ప్రయత్నిస్తాను.
“జీవితం కోసం అమ్మ భాష, జీతం కోసం ఆంగ్ల భాష”
అన్న నానుడి తో ముగిస్తున్నా.